ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భూటాన్ చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లిన మోదీ ఆ దేశ రాజధాని థింపులో ల్యాండ్ అయ్యారు. తాజా పర్యటనలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపనున్నారు. అదేవిధంగా రెండు దేశాల భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో వివిధ కార్యక్రమాలకు మోదీ హాజరుకానున్నారు. తాజా పర్యటనలో భాగంగా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం డ్యూక్ గ్యాల్పోను మోదీకి అందజేయనున్నారు. ఈ అవార్డును మోదీకి 2021లోనే ప్రకటించారు. అప్పటి నుంచి ఆ దేశానికి వెళ్లే అవకాశం ప్రధానికి రాలేదు. ఇప్పుడు ఆ అవార్డును భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్‌చుక్ చేతుల మీదుగా మోదీ స్వయంగా అందుకోనున్నారు.