సామాజిక మాధ్యమాల్లో ప్రధాని నరేంద్ర మోదీ క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతున్నది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 10 కోట్లు దాటింది. దాంతో ప్రపంచంలో ఇంతమంది ఫాలోవర్లు ఉన్న రాజకీయ నేతగా ఆయన రికార్డు సృష్టించారు. ప్రధాని మోదీ 2014 నుంచి ఇన్‌స్టాగ్రామ్ వినియోగించడం ప్రారంభించారు. ఇప్పుడు అత్యధిక ఫాలోవర్లు ఉన్న పొలిటీషియన్ రికార్డు నెలకొల్పారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే, మోదీ ఫాలోవర్ల సంఖ్య రెండు రెట్లు ఎక్కువ. 4.3 కోట్ల మంది ఫాలోవర్లతో ట్రంప్ రెండో స్థానంలో ఉన్నారు. ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో (1.5 కోట్లు), బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా (1.4 కోట్లు), తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ (1.1 కోట్లు), అర్జెంటీనా అధ్యక్షుడు హవియేర్ మిలే (64 లక్షలు) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 1.2 కోట్ల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు.















