సుదీర్ఘ కాలం తర్వాత హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఎల్బీ స్టేడియం మళ్లీ క్రీడాస్ఫూర్తికి వేదికగా ప్రజాప్రతినిధుల సందడితో కోలాహళంగా మారింది. నాయకులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుందన్న “Fit Leaders – Fit State” సందేశంతో “తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్, కల్చరల్ మీట్ – మొదటి ఎడిషన్” క్రీడలు ఆద్యంతం ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి.

బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్వహించే శాసనమండలి, శాసనసభ సభ్యులకు 14 సంవత్సరాలుగా నిలిచిపోయిన క్రీడా సంప్రదాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి ప్రారంభించారు. ప్రారంభించడమే కాకుండా సహచర మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి పలు క్రీడల్లో పాల్గొని క్రీడాస్ఫూర్తిని కలిగించారు.


హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా జ్యోతి వెలిగించి ‘తెలంగాణ లెజిస్లేటర్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ 2026’ పోటీలు ప్రారంభించారు .ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ క్రీడల్లో పాల్గొనక పోవడాన్ని తప్పు పట్టారు. తమ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా క్రీడా పోటీలు నిర్వహిస్తే బారాస ప్రతినిధులు వాటిని బహిష్కరించడం తగదన్నారు.

ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర క్రీడాకారులు పెద్దఎత్తున పాల్గొన్నారు.















