ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమై ఏడాది పూర్తవుతున్న సమయంలో ఆందోళనకర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఒకవైపు యుద్ధక్షేత్రంగా ఉన్న ఉక్రెయిన్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆకస్మికంగా పర్యటించిన మరునాడే రష్యా అణ్వాయుధ ప్రయోగాల పునరుద్ధరణకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. గతంలో అణ్వాయుధాల పరిమితికి అమెరికాతో చేసుకున్న ఒప్పందం నుంచి తాత్కాలికంగా తప్పుకుంటున్నట్టు ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. జాతినుద్దేశించి మాట్లాడిన పుతిన్ ఉక్రెయిన్‌లో రష్యా ఓడిపోవడమే లక్ష్యమని అమెరికా, నాటో దళాలు బహిరంగంగా ప్రకటిస్తున్నాయన్నారు. ఆ దేశాలు తాము ఓడిపోవాలని కోరుకుంటున్నాయని, తమ దేశ అణు కేంద్రాలను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని పుతిన్ ఆరోపించారు. రష్యా ఎయిర్‌బేస్‌లపై ఉక్రెయిన్ చేస్తున్న డ్రోన్ దాడులకు నాటో దేశాలు సహకరిస్తున్నాయన్నారు. అమెరికాతో గతంలో చేసుకున్న న్యూ స్టార్ట్ ఒప్పందం నుంచి తాత్కాలికంగా తప్పుకొంటున్నామని, అమెరికా ఇలానే వ్యవహరిస్తే అణ్వాయుధాల ప్రయోగాల పునరుద్ధరణకు కూడా సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.
