Namaste NRI

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అస్తమయం … సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ చెరుకూరి రామోజీరావు(88) కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన పార్థివదేహాన్ని తరలించనున్నారు.

.1936 నవంబర్‌ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ఈనాడు ను ప్రారంభించారు. ప్రారంభించిన నాలుగేళ్లలోనే పాఠకుల మానసపుత్రికగా ఈనాడు మారింది. ఈనాడుతో పాటు కీలక మైలురాయిగా సితార సినీ పత్రిక నిలిచింది.బహుముఖ ప్రజ్ఞ.. కఠోర సాధన.. ఇదే రామోజీ అస్త్రాలు. నలుగురు నడిచిన బాట కాదు.. కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం. లక్ష్య సాధనకు దశాబ్దాలపాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు. రైతుబిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించారు.మీడియా మహాసామ్రాజ్యాన్ని నిర్మించిన రామోజీరావు.. చైతన్యదీప్తుల్లాంటి చిత్రరాజాలను సృజించారు. అద్భుత ఫిల్మ్‌సిటీని సృష్టించారు. తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆఖరి క్షణం వరకూ ప్రజా శ్రేయస్సు కోసమే పరితపించారు. పనిలోనే విశ్రాంతి అనేది ఆయన ప్రాథమిక సూత్రం. చివరి క్షణం వరకు పనిలోనే విశ్రాంతి సిద్ధాంతాన్ని పాటించిన మహనీయుడు.

రామోజీరావు అస్తమయం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివికేగింది. ఓం శాంతి- చిరంజీవి
తెలుగు పత్రికా రంగంలో రామోజీ రావు మకుటం లేని మహారాజు. తెలుగులోనే కాదు దేశ పత్రికా రంగంలో ఓ కొత్త ఒరవడిని సృష్టించారు. భావితరాల పత్రికా ప్రతినిధులకు మార్గదర్శిగా నిలిచారు. చిత్రసీమలో అదే తీరున సాగి ఉషోదయ కిరణాలను ప్రసరింపజేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియోగా రామోజీ ఫిలిం సిటీని తెలుగు నేలపై నెలకొల్పారు- బాలకృష్ణ
శ్రీ రామోజీ రావు గారు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత, భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. నిన్ను చూడాలని చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికి మరువలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను- జూ.ఎన్టీఆర్
రామోజీరావు గారు నిజమైన దార్శనికుడు. భారతీయ మీడియాలో ఆయన విప్లవాత్మక కృషి చేశారు. జర్నలిజం, సినీ రంగంలో ఆయన చేసిన కృషి ఎంతోమందికి స్ఫూర్తి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి –సినీ నటుడు వెంకటేశ్

రామోజీరావు తెలుగు వెలుగు.. ఆయన మృతి తీరని లోటు.సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్య విజయాలు సాధించారు. ఆయన మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని భావించా. కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన వ్యక్తి రామోజీరావు. ఆయన తెలుగు ప్రజల ఆస్తి, రామోజీరావు మరణం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా తీరని లోటు- చంద్రబాబు
అక్షరయోధుడు రామోజీరావు తుదిశ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా.ఆయన స్థాపించిన ఈనాడు పత్రిక భారతీయ పత్రికా రంగంలో పెను సంచలనమే. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారు. ప్రజా పక్షం వహిస్తూ వాస్తవాలను వెల్లడిస్తూ, జన చైతన్యాన్ని కలిగించారు. ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచారు. రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణంతో భారతీయ చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ ను వేదికగా చేశారు. ఆయన కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను- పవన్ కల్యాణ్
రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను- వైఎస్ జగన్
రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. స్వయంకృషితో ఎదిగిన గొప్ప దార్శనికుడు రామోజీరావు- కేటీఆర్
సాధారణ వ్యక్తిగా ప్రారంభమైన ఆయన జీవితం అందరికీ ఆదర్శం. నిరంతర శ్రమ, నిత్యం కొత్తదనం కోసం తపన, చెదరని ఆత్మస్థైర్యం, నిబద్ధత, క్రమశిక్షణ కలగలిసిన గొప్ప వ్యక్తి. తెలుగు వాడి సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన రామోజీరావు చిరస్మరణీయులు. పత్రిక, టీవీ, సినిమా తదితర రంగాల్లో రామోజీరావు సాధించిన విజయాలు ఆయనకు మాత్రమే కాకుండా యావత్ తెలుగు జాతికి గర్వకారణం. రామోజీరావు గారి కుటుంబానికి, శ్రేయోభిలాషులకు, రామోజీ సంస్థల ఉద్యోగులకు నా ప్రగాఢ సంతాపం- హరీష్ రావు
ప్రముఖ సినీ నిర్మాత, మీడియా సంస్థల అధినేత, విద్యావేత్త రామోజీరావు మరణం విచారకరం. మీడియా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన దూరదృష్టి గల వ్యక్తి ఆయన. సినిమా, పాత్రికేయ రంగానికి విశేష కృషి చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా – కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే
తన కృషితో లక్షలాది మందికి ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి రామోజీరావు. 50 సంవత్సరాల నుంచి ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తున్నారు. భారతరత్న ఆయనను సత్కరించడమే మనమిచ్చే ఘనమైన నివాళి- రాజమౌళి
ఆయన ఒక రైతు కుటుంబంలో జన్మించి కష్టపడి చదువుకున్నారు. అన్ని రంగాల్లో వారు సేవలందించారు. చాలామందికి ఉద్యోగాలు కల్పించి ఆదుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా- నందమూరి రామకృష్ణ
రామోజీరావు గారి మృతి చాలా బాధాకరం. ఆయన్ని కలిసిన ప్రతిసారి ఎంతో లోతైన జీవిత పాఠాన్ని నేర్చుకున్నాను. ఆయన తెలివి, ధైర్యం, నాపై చెరగని ముద్ర వేశాయి. సినీ పరిశ్రమకు కూడా ఆయన ఎప్పుడూ అండగా నిలిచారు. జర్నలిజం, వినోద రంగంలో అసమానమైన ప్రమాణాలను నెలకొల్పి గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఎంతో మందికి స్ఫూర్తి. ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియచేస్తున్నా- మంచు విష్ణు

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress