రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం రావణాసుర. హీరోలు లేరు అనేది ట్యాగ్‌లైన్. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ పతాకాలపై అభిషేక్ నామా నిర్మించనున్న ఈ చిత్రంలో లాయర్ పాత్రలో కనిపిస్తారు రవితేజ. అయితే ఈ చిత్రంలో రామ్ అనే కీలక పాత్రను హీరో సుశాంత్ చేయనున్నారని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సుశాంత్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. రావణాసుర స్క్రిప్ట్, రామ్ పాత్ర నచ్చి సుశాంత్ ఈ సినిమాకు ఓకే చెప్పారు. శ్రీకాంత్ విస్సా కథ అందించిన ఈ చిత్రం యాక్షన్, థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనుంది. రవితేజ నటిస్తున్న 70వ చిత్రమిది. ఈ నెల 14న హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమవుతుంది. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం అని చిత్ర యూనిట్ పేర్కొంది. త్వరలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని వెల్లడిస్తాం అని చిత్ర బృందం తెలిపింది.