జన్యుపరంగా పంది కిడ్నీ మార్పిడి ద్వారా చరిత్ర సృష్టించిన 62 ఏళ్ల రిచర్డ్ స్లేమాన్ తాజాగా మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. రెండు కిడ్నీలు ఫెయిల్ అయిన రిచర్డ్‌కు ఈ ఏడాది మార్చిలో శస్త్రచికిత్స ద్వారా పంది కిడ్నీని అమర్చారు. అమెరికాలోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ లో దాదాపు నాలుగు గంటలపాటు ఆపరేషన్ చేసిన వైద్యులు విజయవంతంగా పంది కిడ్నీని అమర్చారు.
ఆ తర్వాత రెండు వారాలకు ఆయన్ని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. కిడ్నీ అమర్చిన రెండు నెలలకు తాజాగా అతను ప్రాణాలు కోల్పోయాడు. అయితే, అతడి మరణానికి గల కారణాలు మాత్రం కుటుంబ సభ్యులు వెల్లడించలేదు. మరోవైపు రిచర్డ్ మృతిపట్ల మసాచుసెట్స్ ఆసుపత్రి వైద్యులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పంది కిడ్నీ అమర్చడం వల్లే అతడు మరణించినట్లు ఎలాంటి ఆధారాలూ లేవని వైద్యులు వెల్లడించారు.