బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఎగ్జిట్‌పోల్స్‌ను నిజం చేస్తూ 14 ఏండ్లపాటు అధికారం చెలాయించిన కన్జర్వేటివ్ పార్టీకి ఓటమి ఖరారైంది. కీర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ ఘన విజయం దిశగా దూసుకెళ్తున్నది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ స్పందించారు. ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారు.
ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో తన మద్దతుదారులను ఉద్దేశించి సునాక్ ప్రసంగించారు. బ్రిటన్ ప్రజలు నిర్ణయాత్మకమైన తీర్పును ఇచ్చారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ నేత కీర్ స్టార్మర్‌కు అభినందనలు తెలియజేస్తున్నా. అధికారం శాంతియుతంగా చేతులు మారుతుంది. అది మన దేశ భవిష్యత్తు, స్థిరత్వంపై అందరికీ విశ్వాసం కలిగిస్తుంది. ప్రజల తీర్పును గౌరవిస్తూ, ఓటమికి బాధ్యత వహిస్తున్నా. ఈ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు క్షమాపణలు కోరుతున్నా అని సునాక్ తెలిపారు.