
దివంగత ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీ తరపున గతంలో వాదించిన ముగ్గురు లాయర్లకు ఆ దేశ కోర్టు జైలుశిక్షను ఖరారు చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తున్న వారిపై పుతిన్ సర్కార్ చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా గతంలో నవాల్నీకి వాదించిన ముగ్గురు లాయర్లను జైళ్లో వేశారు. వాదిమ్ కోబ్‌జెవ్, ఇగర్ సెర్గునిన్, అలెక్సీ లిప్‌స్టర్‌కు, మూడున్నర నుంచి అయిదేళ్ల పాటు శిక్షను ఖరారు చేశారు. మాస్కోకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెటుషికి పట్టణ కోర్టు ఈ శిక్షను వేసింది. తీవ్రవాద గ్రూపులతో కలిసి పనిచేస్తున్నారన్న ఆరోపణలపై 2023 అక్టోబర్‌లో ఆ ముగ్గుర్నీ అరెస్టు చేశారు. నవాల్నీ నెట్వర్క్‌లతో కలిసి ఆ లాయర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 19 ఏళ్ల జైలుశిక్ష పడ్డ అలెక్సీ నవాల్నీ, 2023 ఫిబ్రవరిలో ఓ జైలులో మరణించాడు. నవాల్నీకి చెందిన సంస్థలన్నీ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు 2021లో ప్రభుత్వం పేర్కొన్నది.
