జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా వారసుడిగా ఆ దేశ రక్షణ శాఖ మాజీ మంత్రి షిగెరు ఇషిబా (67) ఎన్నిక య్యారు. అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికలో విజయం సాధించిన ఇషిబా, వచ్చేవారం జపాన్ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 2021లో కిషిదా ఎల్‌డీపీ అధ్యక్షునిగా ఎన్నికైన విషయం విదితమే. ఆయన మూడేండ్ల పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుండటంతో ఎల్‌డీపీ అధ్యక్ష పదవికి తాజాగా ఎన్నిక నిర్వహించారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో కిషిదా ఈ ఎన్నికకు దూరంగా ఉన్నారు. ఎల్‌డీపీ అధ్యక్ష పదవికి ఇద్దరు మహిళలు సహా మొత్తం 9 మంది పోటీపడ్డారు. ప్రస్తుత ప్రధాని కిషిదా, ఆయన మంత్రి వర్గం వచ్చే నెల 1న రాజీనామా చేయనున్నది. అనంతరం ఇషిబా నేతృత్వంలో కొత్త మంత్రివర్గం కొలువుదీరనున్నది.