గ్లోస్టర్‌లోని పేట్స్ గ్రామర్ స్కూల్‌లో ఇండియన్ కల్చర్ అసోసియేషన్ గ్లోస్టర్‌షైర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సీతారామ కల్యాణ మహోత్సవం భక్తి, సంప్రదాయం, సమాజ ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. సీతారాముల దివ్య కల్యాణాన్ని స్మరించుకోవడంతో పాటు, విదేశాల్లో పెరుగుతున్న యువతకు భారత సంప్రదాయ విలువలను పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు.


ఐసీఏజీ ఆధ్వర్యంలో గత ఐదేళ్లుగా సీతారామ కల్యాణాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. గతంలో హెచ్‌సీఏ సంస్థతో కలిసి హోలీ, శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమాల్లో యాదగిరిగుట్ట దేవస్థానం ప్రతినిధులు, యూకేటీఏ వంటి సంస్థలతో సమన్వయం చేయడం విశేషం. రాధా కల్యాణం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా విజయవంతంగా నిర్వహించారు. చిన్నజీయర్ స్వామి సేవాసంస్థ తరపున పెద్దసంఖ్యలో పిల్లలతో కలిసి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. గ్లోస్టర్‌లో నిర్వహించిన సీతారామ కల్యాణం భక్తిపరంగానే కాక, సంస్కృతి పరిరక్షణలో కూడా ఓ ముఖ్యమైన అడుగుగా నిలిచిందని నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్యం, కూచిపూడి నత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పిల్లలు ఆలపించిన భక్తి గీతాల కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని చేకూర్చింది. యుద్ధాలు ఆగి, ప్రపంచ శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తూ సీతారామ కల్యాణ మహోత్సవం లో పిల్లలు, పెద్దలు కలిసి మూడుసార్లు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా సకలా ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకల్లో ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా 1200 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు.















