లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీని పెద్దల సభకు పంపాలని పార్టీ అగ్రనాయకత్వం యోచిస్తోంది. సోనియా రాజస్ధాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యేలా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఈ దిశగా ఏఐసీసీ నిర్ణయం తీసుకోనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలి నుంచి ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల బరిలో ఉంటారని సమాచారం. యూపీలో విపక్ష ఇండియా కూటమిలో కాంగ్రెస్‌కు ఎస్పీ కొన్ని స్ధానాలు ఆఫర్ చేస్తోంది.
వీటిలో రాయ్ బరేలి నుంచి ప్రియాంక గాంధీ పోటీలో ఉంటే ఉత్తరాదిలోని కీలక హిందీ రాష్ట్రంలో విపక్ష కూటమికి అనుకూల వాతావరణం నెలకొనే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యూపీలో కాంగ్రెస్ బలోపేతానికి ప్రియాంక గాంధీ కొన్నేండ్లుగా పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుండటం కూడా కలిసివస్తుందని కాంగ్రెస్ యోచిస్తోంది.