నందమూరి తారకరత్న మెదడుకు స్కాన్ తీసినట్లు టీడీపీ హిందుపూర్ పార్లమెంట్ జనరల్ సెక్రటరీ అంబికా లక్ష్మీనారాయణ వెల్లడించారు. వచ్చే రిపోర్టులను బట్టి మెదడు పరిస్థితి ఎలా ఉందని తెలుస్తుందని, దాన్ని బట్టి కుటుంబసభ్యులు తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారని తెలిపారు. కాగా జనవరి 27న 45 నిమిషాలు గుండె ఆగిపోవడం వలన తారకరత్న మెదడులో మెదడులో నీరు చేరి మెదడు వాచిందని, వాపు తగ్గిన వెంటనే బ్రెయిన్ రికవరీ అవుతుందని వైద్యులు తెలిపారు.వారం రోజులుగా తారకరత్న వెంటిలేటర్పైనే ఉన్నాడు. ఇంకా స్పృహలోకి రాలేదు. ఆయన్ను కాపాడేందుకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు అహర్నిశలు కృషి చేస్తున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు నందమూరి కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నారు. సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ ఆసుపత్రి వద్ద ఉంటూ నిత్యం వైద్యులను సంప్రదిస్తూ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కుప్పంలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం యాత్రలో గుండెపోటుతో కుప్పకూలిన తారకరత్న ఇంకా స్పృహలోకి రాలేదు .. తారకరత్న త్వరగా కోలుకోవాలని నందమూరి అభిమానులు పూజలు చేస్తున్నారు.