దక్షిణాఫ్రికాలోని తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. జోహానెస్‌బర్గ్ నగరంలోని మిడ్రాండ్‌లోని డ్రీమ్ హిల్ ఇంటర్నేషనల్ స్కూల్ లో జరిగిన ఈవేడుకకు, తెలంగాణ వాసులే కాకుండా, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రవాస భారతీయులు, అక్కడి స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా(టాసా) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిబింబంగా పిల్లలు నృత్యాలు, పాటలతో అలరించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భారతీయ కాన్సులేట్ జనరల్ సభ్యులు హరీశ్ కుమార్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ప్రజల ఆశయాలకు, అభివృద్ధికి కొత్త దిశలు తెరుచుకున్నాయి. ఇలాంటి సంబరాలు ఇతర దేశాల్లో జరగడం గర్వకారణం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటైన కార్యవర్గ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా నూతన అధ్యక్షుడు, మురళి బండారు మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. ఇది మా మట్టికి మనం ఇచ్చే గౌరవానికి నిదర్శనం. తెలంగాణ సమైక్యతకు, సాంస్కృతిక విలువలకు ఇదే ఉదాహరణ అని తెలిపారు.

ఈ సందర్భంగా, టాసా కమిటీ, తన నూతన కార్యవర్గ బృందాన్ని ఏర్పాటు చేసింది. టాసా అధ్యక్షులుగా మురళి బండారు, ఉపాధ్యక్షులుగా సీతారామరాజు రాప్రోలు, ప్రధాన కార్యదర్శిగా రతన్ శేర్ల, కోశాధికారిగా ప్రవీణ్ కొప్పుల, చైర్మన్‌గా సుబ్బారావు కష్టాల, వైస్ చైర్మన్‌గా రజిని పడాల, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్స్ గా చందు బీరవల్లి, శ్రీకాంత్ గోవింద్, అవినాష్ రెడ్డి, కౌముది వేముల, లావణ్య తాళ్ళపల్లి, ఇతర కార్యవర్గ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
