ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్లో అమెజాన్ (Amazon) కంపెనీతో రూ.60,000 కోట్ల విలువైన అతి పెద్ద పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హైదరాబాద్ లొ డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అమెజాన్ (Amazon) సంస్థ ఒప్పందం చేసుకుంది.
దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలోని తెలంగాణ పెవిలీయన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పరిశ్రమలు-ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (Amazon Web Services) గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకే (Michael Punke) భేటీ అయ్యారు.
అమెజాన్ వెబ్ సర్వీసెస్ (Amazon Web Services) రూ. 60,000 కోట్ల పెట్టుబడుల ప్రణాళికలతో హైదరాబాద్లో తమ డేటా సెంటర్లను పెద్ద ఎత్తున విస్తరిస్తోంది.భవిష్యత్తులో అర్టిఫిషియల్ ఆధారిత క్లౌడ్ సేవల వృద్ధికి ఈ డేటా సెంటర్లు కీలకంగా మారనున్నాయి. తెలంగాణలో తన క్లౌడ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి 2030 నాటికి 4.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇప్పటికే ప్రకటించింది.
ఒక బిలియన్ పెట్టుబడులతో రాష్ట్రంలో మూడు సెంటర్లను గతంలోనే అభివృద్ధి చేసింది. ఈ మూడు కేంద్రాలు ఇప్పటికే పనిచేస్తున్నాయి.కొత్తగా చేపట్టే విస్తరణ ప్రణాళికలకు అవసరమైన భూమిని కేటాయించాలని అమెజాన్ వెబ్ సర్వీసెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. రాష్ట్ర ప్రభుత్వం అందుకు అంగీకరించింది.
అమెజాన్ వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడులకు ముందుకు రావటం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ తో ప్రజా ప్రభుత్వం ఏడాదిగా చేపట్టిన ప్రయత్నాలు ఫలించాయని అన్నారు. ఈ ఒప్పందంతో హైదరాబాద్ దేశంలో డేటా సెంటర్ల కేంద్రంగా తిరుగులేని గుర్తింపు సాధిస్తుందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.