అమెరికా వ్యాప్తంగా పాలస్తీనా అనుకూల నిరసనలు కొనసాగుతున్నాయి. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 17న కొలంబియా యూనివర్సిటీలో ప్రారంభమైన ఆందోళనలు వివిధ విశ్వవిద్యాలయాలకు వ్యాపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అక్కడ జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో ఒకటైన మెట్ గాలా కు కూడా ఈ నిరసనల సెగ తాకింది. న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో ఏటా మే నెలలో ఈ వేడుకను నిర్వహిస్తుం టారు. ఈ ఏడాది కూడా మే 6వ తేదీన ఈ ఫ్యాషన్ వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కొందరు ఆందోళనకారులు అక్కడ అలజడి సృష్టించారు. పాలస్తీన అనుకూల నిరసనలతో ఈ వెంట్ జరుగుతున్న ప్రదేశంలో నిరసన చేపట్టారు. పాలస్తీనా జెండాలను చేతపట్టుకుని గాజా, పాలస్తీనాకు అనుకూల నినాదాలు చేశారు. స్మోక్ బాంబుల తో మెట్ గాలాకు అంతరాయం కలిగించే ప్రయత్నం చేశారు.
వీరి నిరసనలతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మెట్ గాలాకు హాజరయ్యేందుకు వచ్చిన ప్రముఖులు, ఇతరులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసన కారులను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా ఈవెంట్ జరుగుతున్న ప్రదేశంలోని పరిసన ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రముఖులు తప్ప ఎవరినీ ఆ ప్రాంతంలోకి రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.