అణుయుద్ధం వచ్చే అవకాశం ఉన్నది. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి అంటూ తమ పౌరులను ఐరోపా దేశాలు అప్రమత్తం చేస్తున్నాయి. రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడి చేసేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా అనుమతించడం, దీనిని స్పందన తమ అణువిధానాన్ని రష్యా మార్చుకోవడంతో ఐరోపాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో యుద్ధమే సంభవిస్తే ఎలా వ్యవహరించాలి, ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలను స్వీడన్, ఫిన్‌లాండ్, నార్వే, డెన్మార్క్ వంటి దేశాలు ప్రజలకు వివరిస్తున్నాయి.
ఈ మేరకు స్వీడన్, నార్వే పాంప్లెట్లను పంపిణీ చేస్తుండగా, ఫిన్‌లాండ్ ఒక ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు చేసింది. అణుదాడి సహా అత్యవసర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున నిత్యావసర వస్తువులు, మంచినీరు, ఔషధాలను నిల్వ చేసుకోవాలని ప్రజలకు డెన్మార్క్ ఈమెయిళ్లు పంపించింది. ఐయోడిన్ ట్యాబ్లెట్లు, సులువుగా వండుకునే ఆహారం, పెంపుడు జంతువులకు ఆహారం నిల్వ చేసుకోవాలని, బ్యాకప్ విద్యుత్తు సదుపాయం ఏర్పాటు చేసుకోవాలని ఫిన్‌లాండ్ సూచించింది. ఆలుగడ్డలు, క్యాబేజ్, క్యారెట్, గుడ్లు వంటి నిత్యావసర వస్తువులను నిల్వ చేసుకోవాలని ప్రజలను స్వీడన్ కోరింది.