బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం బ్రహ్మా ఆనందం. ఈ చిత్రానికి ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించారు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. హైదరాబాద్లో జరిగిన బ్రహ్మా ఆనందం చిత్ర ప్రీరిలీజ్ వేడుకకు అగ్ర నటుడు చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఈ జన్మంతా ఇక రాజకీయాలకు దూరంగా ఉంటూ ఆ కళామతల్లితోనే ప్రయాణం సాగిస్తాను. పెద్ద పెద్ద వాళ్లకి దగ్గరవుతున్నాను కాబట్టి నేను మళ్లీ రాజకీయాల్లోకి వెళ్తానేమోనని చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి. మరో రకంగా సేవలందించడానికి మాత్రమే వాళ్లతో సంబంధాలు కొనసాగిస్తున్నా తప్ప పొలిటికల్గా వెళ్లడం అనేది లేదు. రాజకీయంగా నా ఆశయాలను నెరవేర్చడానికి పవన్కల్యాణ్ ఉన్నాడు అన్నారు.
చంటబ్బాయ్ షూటింగ్ టైమ్లో నాకు బ్రహ్మానందతో పరిచయం ఏర్పడింది. ఆయన మిమిక్రీ చేసి మా చిత్రబృందాన్ని మొత్తం కడుపుబ్బా నవ్వించేవారు. ఇంతటి ప్రతిభ ఇక్కడే ఆగిపోకూడదనుకొని చెన్నైకి రమ్మని ఆహ్వానించాను. ఆయన్ని తొలుత చెన్నైకి విమానంలో నేనే తీసుకెళ్లాను. మా ఇద్దరిది గురుశిష్యుల అనుబంధం. ఆయన నా ఆత్మబంధువు. నాకు ఎంతో ఆత్మీయుడైన బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ నటించిన ఈ సినిమా పెద్ద హిట్ కావాలని, నటుడిగా ఆయన భవిష్యత్తు బంగారం కావాలని కోరుకుంటున్నా అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ సరదాగా జీవితాన్ని గడిపే ఓ తాత, కాస్త గర్విస్టి అయిన మనవడు మధ్య ఈ కథ నడుస్తుంది. తాతామనవడి ప్రేమకథ ఇది. మెగాస్టార్ చిరంజీవితో నాది నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం. చిరంజీవి నిజమైన ట్రెండ్సెట్టర్. ఆయన్ని కారణజన్ముడని చెప్పొచ్చు. విశ్వమంతా విస్తరించిన కల్పవృక్షం ఆయన అన్నారు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ కార్యక్రమంలో దర్శకులు నాగ్అశ్విన్, అనిల్ రావిపూడితో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/gautamadani-300x160.jpg)