బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ ఎన్‌ఆర్‌ఐ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, హామీలు అమలు కాకుండా మోసపూరిత రాజకీయ డ్రామాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని నోటీసులు జారీ చేయడం, కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ఆరోపణలు చేయడం రాజకీయ ప్రతీకారమేనని, ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి దెబ్బతీసే కుటిల చర్య అని మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, రైతులకు రుణమాఫీ, యువతకు ఉద్యోగాలు, మహిళలకు ఆర్థిక సాయం వంటి వాగ్దానాలు కేవలం మాయమాటలుగా మిగిలాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌ను టార్గెట్ చేసి, అనవసర వివాదాలు సృష్టిస్తోందని, రేవంత్ రెడ్డి బీజేపీ, టీడీపీలతో చేతులు కలిపి తెలంగాణ ఆత్మను అవమానిస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేసినందుకు పశ్చాత్తాపం చెందుతున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలు ఈ మోసపూరిత ప్రభుత్వానికి ప్రజాకోర్టులో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కేసీఆర్ అనేది తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, ఆయన మేరు పర్వతం లాంటి వ్యక్తి. రేవంత్ రెడ్డి వంటి రాజకీయ అవకాశవాదులు ఆయనను ఢీకొట్టాలని కలలు కంటే, ముందు తమ హామీలను అమలు చేయడంలో నీతి చూపించాలి అని విమర్శించారు.
