యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటించిన చిత్రం పొట్టేల్. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో నిశాంక్‌రెడ్డి కుడితి, సురేశ్‌కుమార్ సడిగె నిర్మించారు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో కథానాయిక సంయుక్త మీనన్‌పొట్టేల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. పొట్టేల్ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని మూఢనమ్మకాలను చూపిస్తూ, విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ఈ సందర్భంగా సంయుక్త మాట్లాడుతూ ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు రియల్ పాన్ ఇండియా ఫిల్మ్ అనిపించింది. అందరికి రీచ్ అయ్యే కథతో తెరకెక్కించారు. దర్శకుడు ఈ సినిమా కథపై నాలుగు సంవత్సరాలు పనిచేయడం మామూలు విషయం కాదు. సాంకేతికంగా అద్భుతమైన క్వాలిటీతో సినిమా తీశారు అని చెప్పారు.
యూనివర్సల్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశామని, కథలోని ఎమోషన్స్ ప్రతి ఒక్కరిని కదిలిస్తాయని దర్శకుడు సాహిత్ మోత్కూరి తెలిపారు. ట్రైలర్‌లో చూసింది కేవలం ఒకశాతం మాత్రమేనని, కమర్షియల్ ఎలిమెంట్స్ కలబోసిన గొప్ప కథ ఇదని అనన్య నాగళ్ల చెప్పింది. విక్రమార్కుడు తర్వాత ఆ స్థాయి విలనీ పండించే అవకాశం దక్కిందని అజయ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.