ఉదయ్‌రాజ్ హీరోగా పరిచయమవుతున్న టీనేజ్ లవ్‌స్టోరీ మధురం. ఎ మెమొరబుల్ లవ్ అనేది ఉపశీర్షిక. వైష్ణవి సింగ్ కథానాయిక. రాజేష్ చికిలే దర్శకుడు. ఎం బంగార్రాజు నిర్మాత. శుక్రవారం సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఉదయ్‌రాజ్ మీడియాతో ముచ్చటించారు. 12ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. ప్రతి డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌గా వర్క్‌చేశా. చాలా సినిమాల్లో బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్టుగా నటించా. ఇన్నాళ్లకు మధురం చిత్రంతో హీరోగా మారా అంటున్నారు.

దర్శకుడు రాజేష్ చికిలేతో నాకెప్పట్నుంచో పరిచయం. ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎక్సయిట్ అయ్యా. 90ల్లో జరిగే కథ ఇది. 10వ తరగతి అమ్మాయి మధు, 9వ తరగతి అబ్బాయి రామ్‌ల మధ్య నడిచే ప్రేమకథ. ఇందులో చిన్న పిల్లాడిగా, స్కూల్ స్టూడెంట్‌గా, మిడిల్ ఏజ్ వ్యక్తిగా మూడు డిఫరెంట్ వేరియేషన్స్‌లో కనిపిస్తా. ఎంతో కష్టపడి ఈ పాత్ర చేశా. ఫుడ్ తినడం మానేసి కొన్ని రోజులు నీళ్లు మాత్రమే తాగేవాడ్ని. నేను చదువుకుంది జెడ్‌పీహెచ్ స్కూల్‌లోనే. అప్పటి రోజుల్ని గుర్తు చేసేలా దర్శకుడు ఈ సినిమా తెరకెక్కించారు అని తెలిపారు. కథానాయిక వైష్ణవిసింగ్ చక్కగా నటించిందని, నటుడిగా కొనసాగడం తనకు ముఖ్యమని, కేవలం హీరోగానే కాకుండా, ఎలాంటి పాత్రనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని, తామంతా కొత్తవాళ్లమైనా ధైర్యం చేసి బంగార్రాజు చిత్రాన్ని నిర్మించారని, వి.వి.వినాయక్, విశ్వక్‌సేన్ లాంటి సినీ ప్రముఖులు ప్రమోషన్ విషయంలో సహకరించారని తెలిపారు.
