2002 గుజరాత్ అల్లర్లు, ఆ ఉదంతంలో ప్రధాని నరేంద్రమోదీ పాత్రపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించిన విషయం తెలిసిందే. ఈ డాక్యుమెంటరీపై అగ్రరాజ్యం అమెరికా తాజాగా స్పందించింది. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ మాట్లాడుతూ బీబీసీ రూపొందించిన ఆ డాక్యుమెంటరీ గురించి తనకు తెలియదని అన్నారు. రెండు శక్తివంతమైన ప్రజాస్వామ్యాలుగా అమెరికా, భారత్కు వాటి భాగస్వామ్య విలువల గురించి బాగా తెలుసని పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్యం శక్తివంతమైందని, ఈ రెండు దేశాలను కలిపి ఉంచే వాటిపై తమ దృష్టి ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే ఈ బంధాన్ని బలోపేతం చేసే అంశాలను గురించే తాము ఆలోచిస్తామని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత రాజకీయ, ఆర్థిక సంబంధాలు ఉన్నట్లు చెప్పారు. అమెరికా, భారత్ ప్రజల మధ్య విడదీయరాని బంధం ఉందని నెడ్ ప్రైస్ పేర్కొన్నారు.
