దక్షిణాఫ్రికా పార్లమెంట్ ఎన్నికల్లో అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్‌సీ) పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్పారు. విడుదలైన చారిత్రక ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. అధికారం చేపట్టిన 30 ఏండ్ల అప్రతిహత ఏఎన్‌సీ పాలనకు ఆ దేశ ప్రజలు వీడ్కోలు పలుకుతూ విభిన్నమైన పాఠం చెప్పారు. బుధవారం జరిగిన ఎన్నికల కౌంటింగ్‌లో మొత్తం 99 శాతం ఓట్ల లెక్కింపు పూర్తవ్వగా అధ్యక్షుడు రాంఫోసా నేతృత్వంలోని అధికార ఏఎన్‌సీకి కేవలం 40 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. ప్రధాన ప్రతిపక్షం డెమోక్రాటిక్ అలయెన్స్ 21 శాతం, ఏఎన్‌సీ నుంచి విభేదించి బయటకు వచ్చిన మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమాకు చెందిక ఎంకే పార్టీకి 14 శాతం ఓట్లు, ద ఎకనమిక్ ఫ్రీడమ్ ఫైటర్స్‌కు 9 శాతం వచ్చాయి. విపక్షాలకు చెందిన 50 పార్టీలు ఈ ఎన్నికల్లో పోటీపడ్డాయి.

1994లో నెల్సన్ మండేలా నేతృత్వంలో అధికారం చేపట్టిన తర్వాత ఆ పార్టీ ఎన్నికల్లో ఓటమి చవిచూడటం ఇదో తొలిసారి. దేశంలో నెలకొన్న అసమానత, పేదరికం, విద్యుత్ సమస్య, నీటి సమస్య, విస్తతృ స్థాయిలో నిరుద్యోగం, విచ్చలవిడిగా అవినీతి పెరగడానికి కారణమైన ఏఎన్‌సీకి బుద్ధి చెప్పేలా ప్రజలు సరైన తీర్పు చెప్పారని విపక్షాలు పేర్కొన్నాయి.
