అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెజాండ్రో మయోర్కాస్‌పై ప్రవేశ పెట్టిప అభిశంసన తీర్మానం అక్కడి ప్రతినిధుల సభలో నెగ్గింది. దాదాపు 150 ఏళ్లలో ఓ కేబినెట్ సభ్యుడిపై ఈ విధంగా జరగడం ఇదే తొలి సారి. అమెరికామెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసలను నివారించడంలో ఆయన విఫలమయ్యారని ఆరోపిస్తూ రిపబ్లికన్లు ఈ తీర్మానం ప్రవేశ పెట్టారు. రిపబ్లికన్ పార్టీకి పట్టున్న ప్రతినిధుల సభలో అతి స్వల్ప మెజార్టీతో (214-213) వారు పైచేయి సాధించారు. ఈ అంశం ఇప్పుడు డెమోక్రాట్ల ఆధిక్యం ఉన్న సెనేట్‌కు చేరుతుంది. అక్కడ నెగ్గితేనే మయోర్కాస్ అభిశంసన అమలు లోకి వస్తుంది. ఆయనకు మద్దతుగా ఓటు వేసిన వారిలో ముగ్గురు రిపబ్లికన్ సభ్యులూ ఉన్నారు. మోపిన అభియోగాలు అభిశంసన స్థాయివి కాదని, దీని వల్ల రాజ్యాంగ విలువలు దెబ్బతింటాయని వారు చెప్పారు. పైగా దీనివల్ల అక్రమ వలసల సమస్య పరిష్కారం కాదని వివరించారు.