దిల్ రాజు నిర్మించిన చిత్రం బలగం. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్ ముఖ్యతారలుగా నటించిన ఈ చిత్రానికి వేణు ఎల్ధండి దర్శకుడు. హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 100 అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ సందర్భంగా నిర్మాతలు విశ్వ విజయ శతకం వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ నేను వంద రోజుల ఫంక్షన్‌లు చూశాను. వంద కోట్ల పోస్టర్‌ను చూశాను. కానీ మొదటిసారి ఇలా వంద అవార్డుల ఫంక్షన్‌ను చూస్తున్నాం అన్నారు. మానవ సంబంధాలు, వాళ్ల ఎమోషన్స్‌తో దర్శకుడు వేణు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇన్నేళ్ల మా కెరీర్‌లో 50 సినిమాలు తీసిన ఒక అంతర్జాతీయ అవార్డు కూడా రాలేదు. కానీ మా వారసులు నిర్మించిన మొదటి సినిమాకే అంతర్జాతీయ అవార్డులు సాధించారు. ఇదొక అద్భుతమైన సినిమా అని మొదటిరోజే అర్థమైంది. మళ్లీ ఇలాంటి గొప్ప చిత్రాలు తీయడానికి ప్రయత్నం చేస్తూనే వుండాలి అన్నారు.
దర్శకుడు వేణు మాట్లాడుతూ మూలాల్లోంచి రాసుకున్న కథ. అంతే సహజంగా తీయాలనుకున్నాను. తీశాను. ఈ సినిమాకు మొదటి హీరో దిల్ రాజు, ఆయన నమ్మడం వల్లే ఈ సినిమా ఈరోజు ఇంత పెద్ద విజయం సాధించింది. సినిమా రిలీజై నాలుగు నెలలు అవుతున్నా ఇంకా ఈ సినిమా నన్ను వదలడం లేదు అన్నారు. తెలుగు సినిమా గురించి చెప్పాలన్నా, రాయలన్నా ఖచ్చితంగా బలగం సినిమా ప్రస్తావన లేకుండా వుండదని హీరో ప్రియదర్శి అన్నారు. ఈ వేడుకలో నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, కాసర్ల శ్యామ్ ఇతర సాంకేతిక నిపుణులు, నటీ నటులు అందరూ పాల్గొన్నారు.