ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుల జాబితా తాజాగా విడుదలైంది. హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ -2024 పేరిట విడుదలైన ఈ జాబితాలో భారత్ గతేడాదితో పోలిస్తే ఒకస్థానం దిగజారి 85వ ర్యాంకుకు పరిమితమైంది. భారతీయ పాస్‌పోర్టుదారులను వీసా రహిత పర్యటనలకు అనుమతించే దేశాల్లో మరో రెండు కొత్తగా వచ్చి చేరినా భారత్ ర్యాంకు కాస్తంత తగ్గడం గమనార్హం. ప్రస్తుతం భారతీయ పౌరులకు 60 దేశాలు వీసాలేకుండానే తమ దేశాల్లో పర్యటించేందుకు అనుమతిస్తున్నాయి. ఈ జాబితాలో ఫ్రాన్స్ తొలిస్థానంలో నిలిచింది. ఫ్రాన్స్ పాస్‌పోర్టు ఉన్న వారు వీసా లేకుండా ఏకంగా 192 దేశాలకు వెళ్లొచ్చు. జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ వంటి దేశాలు కూడా ఈ జాబితాలో ముందు వరుసలో నిలిచాయి. మరోవైపు మన దాయాది దేశం పాకిస్థాన్ 106వ స్థానానికి పరిమితమైంది. మాల్దీవులు మాత్రం ఏకంగా 58వ స్థానంలో నిలిచింది. మాల్దీవుల పాస్‌పోర్టు ఉన్న వారు వీసా లేకుండా 96 దేశాలకు వెళ్లొచ్చు.














