ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ రూపొందించిన చిత్రం వ్యూహం. అజ్మల్, మానస ప్రధాన పాత్రధారులు. దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను విజయవాడలో నిర్వహించారు. ఈ సందర్భం గా రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ పవన్‌కల్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను కూడా ఇంప్రెస్ అయ్యాను. కానీ ఆయన తీసుకున్న రాజకీయ నిర్ణయాలు చూసి అభిమానం పోయింది. పవన్‌కల్యాణ్ కొందరి చేతిలో కీలుబొమ్మగా మారాడు అన్నారు.
రాజకీయాల్లో వున్న వ్యక్తులు బయటకు ఎలా కనిపిస్తారు? సమయం వచ్చినప్పుడు ఎలాంటి కుట్రలు, వ్యూహాలను అమలు చేస్తారు? అనే అంశాలను సైకలాజికల్ కోణంలో విశ్లేషించి ఈ సినిమా తీశాను. నేను రాజకీయాల్లో లేకున్నా, రాజకీయ నాయకుల మనస్తత్వాన్ని బాగా అర్థం చేసుకోగలను. మనకళ్ల ముందు జరుగుతున్న సంఘటనలనే ఈ సినిమాలో చూపించాను. నేను వైసీపీ పార్టీ మనిషినని అందరూ అంటున్నారు. నిజమే జగన్‌కు ఫేవర్‌గానే ఈ సినిమా ఉంటుంది అన్నారు. రాజకీయ సంఘటనల వెనకున్న తెలియని నిజాలను రామ్‌గోపాల్‌వర్మ ధైర్యంగా ఈ సినిమాలో చూపించాడని నిర్మాత దాసరి కిరణ్ కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి రోజాతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.














