తాజా సార్వత్రిక ఎన్నికల్లో దేశప్రజలు స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి ఇవ్వలేదు. ఇండియా కూటమి 233 సీట్లలో గెలుపొందగా, ఎన్డీయే కూటమి 293 సీట్లు సాధించింది. అయితే సొంతంగా 241 స్థానాల్లో మాత్రమే విజయం సాధించిన కమలం పార్టీ మ్యాజిక్ ఫిగర్‌కు 31 స్థానాల దూరంలో నిలిచిపోయింది. దీంతో ఎన్డీయే కూటమికి మిత్రపక్షాల మద్దతు అనివార్యంగా మారింది. అదే సమయంలో 233 స్థానాల్లో గెలుపొందిన ఇండియా కూటమికి 39 స్థానాలు కావాల్సి ఉండటంతో ఆసక్తికరంగా మారింది.
అయితే ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, బీజేపీతో జట్టుకట్టిన టీడీపీ 16 స్ధానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఆ పార్టీ మిత్రపక్షం జనసేన రెండు చోట్ల గెలుపొందింది. మరోవైపు బీహార్‌లో నితీశ్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ 12 స్థానాల్లో గెలుపొందింది. ఎన్డీయే కూటమిలో బీజేపీ తర్వాత ఈ రెండే పెద్ద పార్టీలు కావడం గమనార్హం. బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ దక్కకపోవడంతో నితీశ్ కుమార్, చంద్రబాబు మద్దతు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో తమ వ్యూహం ఏమిటనేది ముందే చెప్పేస్తే మోదీ జాగ్రత్త పడతారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పడం ఆకస్తికరంగా మారింది.