ముగ్గురు భారతీయులు కెనడా గూడ్స్ రైలు నుంచి దూకారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ సిబ్బంది వారిని గుర్తించారు. భారతీయులైన మహిళ, ఇద్దరు పురుషులతోపాటు మరో దేశ పౌరుడ్ని అరెస్ట్ చేశారు. మార్చి 12న నలుగురు వ్యక్తులు కెనడా సరకు రవాణా రైలులో ప్రయాణించారు. కెనడా, అమెరికా సరిహద్దు ప్రాంతమైన బఫెలోలో అంతర్జాతీయ రైల్ రోడ్ వంతెనపై కదులుతున్న రైలు నుంచి వారు దూకారు. ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. కదలలేని పరిస్థితి లో ఉన్న ఆమె రైలు నుంచి దూకిన చోటే ఉండగా, మిగతా ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు.
కాగా, నలుగురు వ్యక్తులు అమెరికా భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించడాన్ని ఆ దేశ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ సిబ్బంది గుర్తించారు. వెంబడించి ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. గాయపడిన మహిళకు ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. ఆ మహిళతో పాటు ఇద్దరు పురుషు లను భారతీయులుగా గుర్తించారు. నాల్గవ వ్యక్తి డొమినికన్ రిపబ్లిక్‌కు చెందినట్లు తెలిపారు. న్యూయార్క్‌లోని బటావియా ఫెడరల్ డిటెన్షన్ కేంద్రంలో వారిని నిర్బంధించారు. అమెరికా నుంచి తిరిగి పంపేందుకు చట్ట పరంగా చర్యలు చేపడుతున్నారు.