అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు మొదలైంది. ఈ ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి జో బైడెన్, డోనాల్డ్ ట్రంప్ పోటీపడనున్నారు. ఇద్దరూ మధ్య తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగింది. అట్లాంటాలోని సీఎన్‌ఎన్ హెడ్‌క్వార్టర్స్‌లో దాదాపు 90 నిమిషాలపాటు జరిగిన ఈ చర్చలో ట్రంప్‌దే పైచేయిగా కనిపించింది. దేశంలోకి శరణార్థులు చొరబడుతున్నారన్న అంశంపై మాజీ అధ్యక్షుడు ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. తాము చేపడుతున్న విధానాల వల్ల ఇమ్మిగ్రేషన్ 40 శాతం తగ్గినట్లు బైడెన్ వెల్లడించారు.
ట్రంప్ పాలన సమయంలో శరణార్థ కుటుంబాలను వేరు చేసినట్లు బైడెన్ ఆరోపించారు. ఆ వ్యాఖ్యలను ట్రంప్ కొట్టిపారేశారు. తన పాలన సమయంలోనే బోర్డర్ ప్రాంతాలు సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. దేశంలోకి భారీ సంఖ్యలో ఉగ్రవాదులు ఎంటర్ అవుతున్నట్లు కూడా ట్రంప్ ఆరోపించారు. చరిత్రను పరిశీలిస్తే తమ పాలన సమయంలోనే బోర్డర్ సురక్షితంగా ఉందని, బైడెన్ సర్కారు అన్నింటినీ విస్మరించిందని,బోర్డర్‌ను తెరవడం వల్ల, జైళ్లు, మానసిక కేంద్రాల నుంచి జనం దేశంలోకి ప్రవేశిస్తున్నట్లు ట్రంప్ ఆరోపించారు. అత్యధిక సంఖ్యలో అమెరికాలోకి టెర్రరిస్టులు వస్తున్నట్లు చెప్పారు.బైడెన్ తడబడుతూ మాట్లాడటంతో ఆయన పార్టీ ఆందోళనకు గురైంది. బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డెమోక్రాట్ల నుంచి డిమాండ్ మొదలైంది.