రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరలేపిన విషయం తెలిసిందే. భారత్, చైనా సహా ప్రపంచ వ్యాప్తంగా 70కిపైగా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించారు. ట్రంప్ నిర్ణయంతో అమెరికా కంపెనీలు, పరిశ్రమలపై పెను ప్రభావం చూపుతోంది. దీంతో ట్రంప్ ఆర్థిక విధానాలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే అమెరికాలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన కాలిఫోర్నియా, ట్రంప్ యంత్రాంగంపై న్యాయపోరాటానికి దిగిన విషయం తెలిసిందే. తాజాగా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ చైర్మన్ జోరోమ్ పావెల్ సైతం ట్రంప్ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్రంప్ యంత్రాంగం ఇప్పటి వరకూ ప్రకటించిన సుంకాలు, ఊహించిన దానికంటే ఎక్కువ అని వ్యాఖ్యానించారు. వీటి గురించి ఎలా ఆలోచించాలో కూడా అర్థం కావట్లేదన్నారు. ట్రంప్ టారిఫ్ విధానాలతో అమెరికాలో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. సుంకాల పెంపుతో ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ పాలనలో విధానపరమైన మార్పులు ఫెడరల్ రిజర్వు సిస్టమ్ (అమెరికా కేంద్ర బ్యాంకు)ను ముంచేశాయని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. టారిఫ్‌ల వల్ల నెలకొన్న అనిశ్చితి ఆర్థిక వ్యవస్థకు శాశ్వత నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
