విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్‌కు వచ్చిన అమెరికా కాన్సులేట్ వాణిజ్య సేవల విభాగం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారి థియోడర్ ఇమాన్యుయేల్, వారి బృందం సందర్శించింది. వారికి పోర్ట్ చైర్మన్ కే. రామమోహన్‌రావు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తమ ప్రాధాన్యతలను అమెరికా అధికారులు పార్ట్ అధికారులకు వివరించారు. విశాఖ పోర్ట్‌లో ఉన్న అవకాశాలను నేరుగా వీక్షించి పరిశీలించేందుకు వచ్చామనీ, అలాగే తమ వాణిజ్య విధానాన్ని వివరించి తద్వారా భివష్యత్తులో విశాఖ పోర్ట్‌తో ఏ విధంగా వాణిజ్యం చేయవచ్చో పరిశీలించేందుకు వచ్చినట్లు వివరించారు.
అమెరికా బృందానికి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్‌లో ఉన్న అవకాశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చైర్మన్ వివరించారు. పోర్ట్‌లో జరుగుతున్న ఎగుమతులు, దిగుమతులు, మౌలిక వసతులు, పోర్ట్ అధునికీకరణ, యాంత్రీకరణ, కవర్ట్ స్టోరేజ్ యార్డ్‌లు, సోలార్ పవర్, పెట్టుబడి అవకాశాలు, భారత్, అమెరికా వాణిజ్యానికి విశాఖపట్నం పోర్ట్ ద్వారా ఉన్న అవకాశాలు వంటి అంశాలను చైర్మన్ వారికి వివరించారు. భారత్ ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలసీ వల్ల విశాఖ పోర్ట్ ప్రాధాన్యత సంతరించుకుందని ఇక్కడ మౌలిక వసతులు అమెరికా వాణిజ్య అంశాలకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని, ఫ్రీ ట్రేడ్ జోన్, క్రూయిజ్, టెర్నిల్ నిర్మాణం వంటి వాటి వల్ల భవిష్యత్తులో విశాఖ పోర్ట్ మరింత కీలకం కానుందని చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చైర్మన్ దుర్గేశ్ కుమార్, పోర్ట్ విభాగాధిపతులు పాల్గొన్నారు.