శివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య లష్కర్ బోనమెత్తింది. లష్కర్ బోనాల జాతర వైభవంగా కొనసాగింది. తెల్లవారుజాము నుంచే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి నగరంతో పాటు ఇతర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తల్లికి బోనాల సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. బోనాల జాతర సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ, ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆమె వెంట రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ఉన్నారు. మరో వైపు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కరోనా నిబంంధనలు పాటించేలా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.