బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. 14 ఏండ్లు అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీని తిరుగులేని మెజార్టీతో మట్టికరిపించింది. లేబర్ పార్టీ 403 స్థానాల్లో విజయం సాధించగా, ప్రధాని రిషి సునాక్ పార్టీ 119 సీట్లకే పరిమితమైంది. కాగా, ఈ ఎన్నికల్లో పోటీచేసిన పలువురు భారతీయులు ఓటమిపాల య్యారు. వారిలో తెలంగాణకు చెందినవారు కూడా ఉన్నారు.
భారత మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు దూరపు బంధువు, అంతర్జాతీయ వక్త, రచయితగా పేరొందిన ఉదయ్ నాగరాజు ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ తరఫున నార్త్ బెడ్‌ఫోర్డ్‌షైర్ స్థానం నుంచి పోటీచేశారు. కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన రిచర్డ్ పుల్లర్ 19,981 ఓట్లతో విజయం సాధించగా, కరీంనగర్ జిల్లా కోహెడ మండలంలోని శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు 14,567 ఓట్లు సాధించారు. ఆయన కుటుంబ సభ్యులు కొన్నేండ్ల క్రితం బ్రిటన్‌లో స్థిరపడ్డారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరికి చెందిన చంద్ర కన్నెగంటి కన్జర్వేటివ్ పార్టీ తరఫున స్టోక్ ఆన్ ట్రెంట్ సెంట్రల్ స్థానం నుంచి పోటీచేశారు. అయితే 6221 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఇక్కడ లేబర్ పార్టీ అభ్యర్థి గారెత్ స్నెల్ విజయం సాధించారు. ఉన్నత విద్యకోసం లండన్ వెళ్లిన చంద్ర అక్కడే స్థిరపడ్డారు. జనర్ ప్రాక్టిషనర్‌గా సేవలందిస్తూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. స్టోక్ ఆన్ ట్రెంట్‌లో రెండు సార్లు కౌన్సిలర్‌గా, ఒకసారి మేయర్‌గా పనిచేశారు.