తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఆధ్వర్యంలో లండన్ బరో ఆఫ్ హౌన్స్, ఫెల్త్‌హాం అసెంబ్లీ హాల్‌లో బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తాల్ కల్చర్ సెంటర్ (టీసీసీ) లో శిక్షణ పొందుతు న్న విద్యార్థినీ విద్యార్థులతో పాటు ఇతర చిన్నారులు సంగీతం, సంప్రదాయ నృత్య ప్రదర్శనలతో అందరినీ అలరించారు.

పర్యావరణ పరిరక్షణ అంశంతో ప్రదర్శించిన లఘు నాటిక సందేశాత్మకంగా ఉండటం పిల్లలు, పెద్దలను ఆకట్టుకుంది. భాషను ప్రోత్సహిస్తూ చిన్నారులకు తెలుగు భాషా పోటీలు నిర్వహించి విద్యార్థులకు ఈ వేదికపై బహుమతులు ప్రదానం చేయడం విశేషం. ఈ కార్యక్రమానికి 500 మందికి పైగా హాజరయ్యారు.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హౌన్స్‌లో మేయర్ కౌన్సిలర్ కారెన్ స్మిత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాల్ చేస్తున్న సేవలను కొనియాడారు. తాల్ స్వచ్ఛంద కార్యకర్తలు సంవత్సరం పొడవునా నిర్వహించే వివిధ సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలు అందరితో కలిసి జరుపుకోవడం ఆనందదాయకంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దిన తాల్ కల్చర్ టీమ్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.


కల్చర్ ట్రస్టీ శ్రీదేవి ఆలెద్దుల మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన కల్చర్ టీమ్ సభ్యులకు, రాయ్ బొప్పనకు ధన్యవాదాలు తెలిపారు. వయసుతో భేదం లేకుండా అందరూ ముందు కు వచ్చి ఈ కార్యక్రమాన్ని నడిపించటం సంతోషదాయకమన్నారు. ఇది తోటీ పిల్లలకు ఆదర్శం కావాలని కోరారు. ట్రస్టీ అశోక్ మాడిశెట్టి తాల్ కల్చర్ సెంటర్‌లో నిర్వహించే తెలుగు భాష, సంస్కృతికి సంబంధించిన శిక్షణా తరగతుల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సంస్థ చైర్మన్ రవి సబ్బా, ఇతర ట్రస్టీలు, అనిల్ అనంతుల, కిరణ్ కప్పెట, వెంకట్ నీల, రవి మోచెర్ల, హాజరయ్యారు.
