ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్న ఇరాన్ మద్దతున్న హౌతీ రెబల్స్‌పై అమెరికా, బ్రిటన్ సైన్యాలు తొలిసారిగా ప్రతీకార దాడులకు దిగాయి. యెమెన్‌లో వారి అధీనంలో ఉన్న డజనుకుపైగా స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. సబ్‌మెరైన్ యుద్ధ విమానాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. లాజిస్టిక్ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, ఆయుధ భాండాగారాలు, రాడార్ వ్యవస్థలే లక్ష్యంగా దాడులు చేశామని అమెరికా అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో బ్రిటన్ సైన్యం ప్రత్యక్షంగా పాల్గొంటున్నదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఆస్ట్రేలియా, బహ్రెయిన్, కెనడా, నెదర్లాండ్స్ తమకు మద్దతిస్తున్నాయని చెప్పారు. ప్రపంచంలోని అత్యంత కీలకమైన జలమార్గాల్లో రవాణా స్వేచ్ఛపై హౌతీలు దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఈ నేపథ్యంలో యెమెన్‌లోని వారి స్థావరాలపై దాడి చేశామన్నారు. కాగా, అమెరికా దాడులను హౌతీ కూడా ధృవీకరించింది. సనాతోపాటు దాని చుట్టుపక్కల పట్టణాలపై బాంబులు పడ్డాయని చెప్పారు.














