ఐర్లాండ్ ప్రధాని, భారత సంతతికి చెందిన లియో వరద్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే తాను ప్రధాని పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తన పార్టీ ఫైన్ గేల్ పదవి నుంచి కూడా లియో వరద్కర్ వైదొలిగారు. తాను ఫైన్ గేల్ అధ్యక్షుడిగా, నాయకుడిగా ఈ రోజు నుంచి వైదొలుగుతున్నానని, తదుపరి నేత ప్రధాని బాధ్యతలు చేపట్టిన అనంతరం తాను ప్రధాని పదవికీ రాజీనామా చేస్తానని చెప్పారు. డబ్లిన్‌లో విలేకరులతో మాట్లాడుతూ వరద్కర్ కీలక ప్రకటన చేశారు. వ్యక్తిగత, రాజకీయ కారణాలతో తాను ప్రధాని పదవితో పాటు పార్టీ పదవుల నుంచి వైదొలుగుతున్నానని ఐరిష్ నేత వెల్లడించారు. భవిష్యత్‌కు సంబంధించి తనకు ఎలాంటి వ్యక్తిగత, రాజకీయ ప్రణాళికలు లేవని పేర్కొన్నారు. 2017లో అధికారంలోకి వచ్చిన వరద్కర్ అత్యంత పిన్నవయస్కుడైన ఐర్లాండ్ ప్రధానిగా ఘనత సాధించారు. దేశానికి సారధ్యం వహించిన సమయం తన జీవితంలో అధిక సంతృప్తిని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.అలాగే ఐర్లాండ్ మొట్టమొదటి స్వలింగ సంపర్కుడైన ప్రధాని కూడా వరద్కరే. అతని తల్లి ఐరిష్ కాగా,తండ్రి భారతీయుడు.