అమెరికాలో హెచ్-1బీ వీసాలపై అటు రాజకీయ నేతల్లో, ఇటు పౌర వర్గాల్లో జోరుగా చర్చ సాగుతున్నది. వాస్తవానికి హెచ్-1బీ వీసా ద్వారా విదేశీయులను రప్పించాల్సిన స్థితిలో అమెరికా లేదని ఆ దేశానికి చెందిన మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. తక్కువ స్థాయిలో నైపుణ్యం గల గ్రాడ్యుయేట్లను అమెరికా తయారు చేస్తున్నదన్న వాదన ను వారు కొట్టిపారేస్తున్నారు. వైట్ కాలర్ ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వడానికి, నియమించడానికి నిపుణులైన ఉద్యోగులు, కార్మికులు ఇప్పటికే దేశంలో తగినంత మంది ఉన్నారని, కొత్తగా నిపుణులైన విదేశీయులను రప్పించాల్సిన అవసరం లేదని మెజార్టీ అమెరికన్లు స్పష్టం చేస్తున్నారు.
ఇటీవల జరిపిన సర్వేలో అధిక శాతం హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని విస్తృతం చేయాల్సిన అవసరం లేదని తెగేసి చెప్పారు. ఇప్పటికే అమెరికా కావల్సినంత మంది నిపుణులను కలిగి ఉందని 60 శాతం పౌరులు అభిప్రాయపడ్డారు. కొత్తగా విదేశాల నుంచి రప్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ దృక్పథం రిపబ్లికన్లలో బలంగా ఉంది. 65 శాతం స్వింగ్ ఓటర్లు, 47 శాతం డెమోక్రాట్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, 26 శాతం మాత్రమే కొత్త నైపుణ్యాన్ని తీసుకురావాలని పేర్కొన్నారు.