రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ఓ ప్రకటన విడుదల చేసింది. త్వరలో అధ్యక్షుడు పుతిన్ భారత్‌లో పర్యటిస్తారని పేర్కొంది. పర్యటన తేదీల ఖరారుపై భారత్‌తో చర్చిస్తున్నామని క్రెమ్లిన్ తెలిపింది. గత నెలలో బ్రిక్స్ సదస్సు లో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమైన మోదీ, వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న 23వ భారత్-రష్యా వార్షిక సదస్సుకు రావాలని పుతిన్‌ను ఆహ్వానించారు. ఈ ఏడాది ఇప్పటికే ఇరువురు నేతలు రెండుసార్లు సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉక్రెయిన్‌తో వివాదాలను చర్చల ద్వారా పరిష్కరిం చుకోవాలని మోదీ ఇప్పటికే పలుమార్లు రష్యాకు సూచించారు. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించడానికి సహకారం అందిస్తామని మోదీ చెప్పారు. పుతిన్ భారత పర్యటన ఖరారైతే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కానుంది.