
నితిన్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం రాబిన్హుడ్. శ్రీలీల కథానాయిక. వెంకీ కుడుముల దర్శకుడు. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రంలో ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిథి పాత్ర పోషించడం విశేషం. ఈ నెల 28న సినిమా విడుదల కానుంది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నితిన్ మాట్లాడారు. దర్శకుడు వెంకీ నాకు దేవుడిచ్చిన తమ్ముడు. నామీద తనకున్న ప్రేమ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఈ సినిమా రేపు విజయం సాధిస్తే, ఆ క్రెడిట్ పూర్తిగా వెంకీ కుడుములదే. డేవిడ్ వార్నర్‌సార్ ఈ సినిమా చేయడం వల్ల సినిమాపై ఆడియన్స్‌లో ఆసక్తి పెరిగింది. సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నా అని అన్నారు.

నన్ను ఓన్ చేసుకొని నాతో నటింపజేసిన టీమ్‌కి థ్యాంక్స్ చెబుతున్నాను. మంచి మనుషులు కలయిక ఈ సినిమా అని డేవిడ్ వార్నర్ అన్నారు. అనుకోకుండా చేసిన సినిమా, అనుకున్న దానికంటే బాగా చేసిన సినిమా రాబిన్ హుడ్ అని శ్రీలీల చెప్పారు. ఈ సినిమా ఇంతబాగా రావడానికి కారణం నితిన్. అద్భుతమైన టీమ్‌ని నాకిచ్చి ముందుకు నడిపించిన నిర్మాతలకు థ్యాంక్స్. డేవిడ్ వార్నర్ సార్ చేయడం వల్ల సినిమాపై అంచనాలు పెరిగాయి అని డైరెక్టర్ వెంకీ కుడుముల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డా.రాజేంద్రప్రసాద్, సంగీత దర్శకుడు జి.వి.ప్రకాశ్‌కుమార్ , నటి కేతిక, రాహుల్ సంకృత్యన్, వివేక ఆత్రేయ, సాయిరాజేష్, కాసర్ల శ్యామ్, దేవ్ దత్, మైత్రీ శశి, హరి తుమ్మల, ప్రశాంత్ పిన్నమనేని తదితరులు పాల్గొన్నారు.
