Namaste NRI

అమెరికా కొత్త చట్టంతో.. వీసా ఫీజుల భారం

అమెరికా వీసా దరఖాస్తుదారులపై వచ్చే ఏడాది నుంచి అదనపు భారం పడబోతున్నది. ఇమిగ్రేషన్‌ సేవల సంస్థ ఫ్రాగోమెన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, నాన్‌ ఇమిగ్రెంట్‌ వీసా జారీ సమయంలో వీసా ఇంటెగ్రిటీ ఫీజు కింద 250 డాలర్లు చెల్లించవలసి ఉంటుంది. వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ చట్టం అమల్లోకి రావడంతో ఈ రుసుమును పెంచే అధికారాన్ని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌)కు కట్టబెట్టారు. వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా ఈ రుసుమును 2026 నుంచి డీహెచ్‌ఎస్‌ పెంచవచ్చు.కానీ తగ్గించడం సాధ్యం కాదు. అయితే, కొన్ని పరిస్థితుల్లో ఈ రుసుముకు మినహాయింపు ఇవ్వవచ్చు. వీసా నిబంధనలన్నిటినీ కచ్చితంగా పాటించేవారికి, ఐ-94 గడువు ముగియడానికి ఐదు రోజుల కన్నా ముందుగానే అమెరికాను విడిచి వెళ్లేవారికి, ఐ-94 గడువు కంటే ముందే చట్టపరంగా కొనసాగింపు, శాశ్వత నివాస అనుమతి పొందినవారికి వీసా ఇంటెగ్రిటీ ఫీజును తిరిగి చెల్లించవచ్చు.

విద్య, ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్లేవారిపై ఈ వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ చట్టం ప్రభావం పడుతుంది. విదేశీ విద్యార్థులు, సాంకేతిక నిపుణులు, పర్యాటకులు, హెచ్‌1బీ వీసాపై అమెరికాకు వెళ్లే ఉద్యోగులపై ఆర్థిక భారం పడక తప్పదు. ఐ-94, ఈఎస్‌టీఏ, ఈవీయూఎస్‌ ఫీజులు కూడా పెరిగే అవకాశం కనిపిస్తున్నది.

Social Share Spread Message

Latest News