ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలపై తాలిబన్లు అనేక ఆంక్షలు పెడుతూ వారి హక్కులను కాలరాస్తున్నట్లు పలు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. వీటిపై అంతర్జాతీయ సమాజం కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే అంశంపై హాలీవుడ్ నటి, ఆస్కార్ అవార్డు గ్రహీత మెరిల్ స్ట్రీప్ ఐక్యరాజ్య సమితి వేదికగా స్పందించారు. ఆఫ్ఘన్‌లో పిల్లులు కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నాయని, కానీ అక్కడి ఆడవాళ్లకు స్వేచ్ఛ లేదని వ్యాఖ్యానించారు. ఉడుతలు పార్కుల్లో స్వేచ్ఛగా ఆడుతున్నాయని, పక్షులు హాయిగా పాడుతున్నాయని అన్నారు.
ఆఫ్ఘన్‌లో నేడు ఆడవాళ్ల కంటే ఆడ పిల్లులకే ఎక్కువ స్వేచ్ఛ ఉంది. అవి బయట కూర్చొని సూర్యరశ్మిని ఆస్వాదించవచ్చు. పార్కుల్లో ఉడుతలు స్వేచ్ఛగా ఎగురుతూ తిరగొచ్చు. అక్కడ ఆడవాళ్ల కంటే ఉడుతకే హక్కులు ఎక్కువ. ఎందుకంటే అక్కడి పార్కుల్లో బాలికలు, మహిళలకు ప్రవేశాలను తాలిబన్లు నిలిపేశారు. ఓ పక్షి అక్కడ స్వేచ్ఛగా పాడగలదు. కానీ మహిళలకు కనీసం ఆ స్వేచ్ఛ కూడా లేదు అని మెరిల్ స్ట్రీప్ ఆవేదన వ్యక్తం చేశారు. న్యూయార్క్‌లో ఐరాస సాధారణ సమావేశాల వేళ ఓ చర్చలో మాట్లాడిన ఆమె, అంతర్జాతీయ సమాజం ఏకతాటిపైకి వస్తే ఆఫ్ఘన్ మహిళలకు మళ్లీ స్వేచ్ఛా వాయువులను అందించవచ్చన్నారు.