రోషన్ హీరోగా అనస్వర రాజన్ జంటగా నటించిన చిత్రం ఛాంపియన్. ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైతం దర్శకుడు. నిర్మాత స్వప్నదత్. పీపుల్స్ ఛాంపియన్ పేరుతో సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వప్నదత్ మాట్లాడుతూ వైజయంతీ మూవీస్‌కి యాభైఏళ్లు. అలాగే స్వప్న సినిమాస్ 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ రెండు బ్యానర్స్‌లో ఛాలెంజింగ్‌గా అనిపించిన కథల్ని ఎంచుకొని సినిమాలు చేస్తున్నాం. కష్టపడి చేసే ప్రాజెక్ట్‌లోనే ఒక తృప్తి ఉంటుంది అన్నారు. ఈ సినిమాకు అద్భుతమైన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కుదిరారని, హీరో రోషన్ మూడేళ్లు ఎఫర్ట్స్ పెట్టారని స్వప్నదత్ ప్రశంసించారు.

దర్శకుడు ప్రదీప్ అద్వైతం మాట్లాడుతూ ఇది తెలంగాణ నేల చరిత్ర. బైరాన్‌పల్లి, అక్కడి మనుషులు, వారి ప్రపంచాన్ని ఆవిష్కరించే క్రమంలో కథను డిటెయిల్డ్‌గా చెప్పాల్సిన వచ్చింది. అందుకే సినిమా కొంచెం స్లో అయిందనే ఫీల్ వస్తున్నది. ఇంత పెద్ద కాన్వాస్ ఉన్న కథలను అలా చెబితేనే ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. అందరూ ఫ్యామిలీతో కలిసి చూడండి. ముఖ్యంగా మన చరిత్రను పిల్లలకు చూపించండి అన్నారు. ఈ సినిమా తనకెంతో ప్రత్యేకమని, ఈ కథకు తాను ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యానని, ఈ స్క్రిప్ట్‌ను ఇచ్చిన దర్శకుడు ప్రదీప్ అద్వైతంకు ప్రత్యేక కృతజ్ఞతలని హీరో రోషన్ అన్నారు. ఇదొక అరుదైన చిత్రమని సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ పేర్కొన్నారు.















