ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంపై యోగా గురు, పతంజలి సహ వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో అమెరికా గెలువదని, ఇరాన్ ఓడిపోదని ఆయన అన్నారు. ప్రపంచ శాంతి స్థాపనలో భారత్ కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. హరిద్వార్ లోని పతంజలి యోగపీఠ్ లో జరిగిన రామనవమి వేడుకల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ యుద్ధంలో అమెరికా గెలువదు, ఇరాన్ ఓడిపోదని నేను గతంలో చెప్పాను. ప్రజాస్వామ్యం అంటే ఇతరులను భయపెట్టడం కాదని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గర్వపడే అమెరికా, ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని కూడా గౌరవించాలని చెప్పారు. పశ్చిమాసియాలో సంక్షోభాన్ని పరిష్కరించడంలో భారత్ కీలకపాత్ర పోషించాలని రాందేవ్ ఆకాంక్షించారు.

వసుధైక కుటుంబం అనే సిద్ధాంతం ఆధారంగా ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకురావాలన్న సందేశాన్ని భారత్ ఇస్తూనే ఉండాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయంగా, దౌత్యపరంగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారని కొనియాడారు. ఎవరైనా మధ్యవర్తిత్వంతో యుద్ధం ఆపగలిగితే అది భారతే అన్నారు. ఈ యుద్ధం వల్ల తలెత్తిన పెట్రోల్, గ్యాస్ సంక్షోభానికి, ప్రపంచ ఆర్థిక మాంద్యానికి చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని చెప్పారు.















