Skip to main content

Namaste NRI

హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి స్వర్ణోత్సవ వేడుకలు

అమెరికాలో తెలుగు సాంస్కృతిక సమితి హ్యూస్టన్ స్వర్ణోత్సవ వేడుకలు ఫోర్ట్ బెండ్ ఎపిక్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు. సంస్థ 50 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని వ్యవస్థాపక బృందాన్ని సన్మానించారు. ఈ సందర్భంగా వారి దూరదృష్టి, సేవలను ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. ఈ స్వర్ణోత్సవ వేడుకల్లో అడుగడుగునా తెలుగు సంస్కృతి, సాహిత్య వైభవం కనిపించింది. ప్రధాన వేదికకు తెలుగు విజయం అని పేరు పెట్టగా, ఉప వేదికలకు నన్నయ, తిక్కన, ఎర్రన్న, పోతన పేర్లను పెట్టారు. ఇది తెలుగు భాష, సాహిత్యానికి ఇచ్చిన గౌరవానికి ప్రతీకగా నిలిచింది. సభా వేదిక ముందు ఏర్పాటు చేసిన స్వాగత తోరణం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాకతీయ, విజయనగర, శాతవాహన కాలాల సంస్కృతి, కళా వైభవాన్ని ప్రతిబింబించేలా దీనిని రూపొందించారు.

శ్రీ వంగూరి చిట్టెన్ రాజు, శాయి రాచకొండ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక సావనీర్‌లో సంస్థ 50 ఏళ్ల చారిత్రక ప్రస్థానాన్ని అక్షరబద్ధం చేశారు. ఈ స్వర్ణోత్సవాల్లో పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, అవసరాల శ్రీనివాసరావు, వామరాజు సత్యమూర్తి, బలభద్రపాత్రుని రమణి, అరుణ సుబ్బారావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. వారు తమ విలువైన ఆలోచనలు, అనుభవాలను పంచుకోవడంతో పాటు తెలుగు భాష, సాహిత్యంపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో స్వర్ణోత్సవ వేడుకలకు మరింత ప్రత్యేకత వచ్చింది. తెలుగు సాంస్కృతిక సమితి హ్యూస్టన్ 50 ఏళ్ల ప్రస్థానాన్ని ‘స్వర్ణ వైభవం’ పేరుతో నృత్య రూపకంగా ప్రదర్శించారు. సంస్థ చరిత్ర, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాగిన ఈ ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

భారత్ నుంచి వచ్చిన సినీ ప్రముఖులు పద్మశ్రీ రాజేంద్ర ప్రసాద్, అలీ, నవీన్ పోలిశెట్టి, రీతూ వర్మ, అవసరాల శ్రీనివాస్ తమ ప్రత్యేక ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. సాయంత్రం నిర్వహించిన ‘స్వర్ణోత్సవ సరిగమలు’ కార్యక్రమం సంగీత సందడితో సాగింది. ప్రముఖ గాయని సునీత, గాయకుడు కృష్ణ చైతన్య, ‘ఇన్‌ఫ్యూషన్’ సంగీత బృందం తమ మధురమైన గానంతో ప్రేక్షకులను అలరించారు.

ఈ కార్యక్రమానికి ఐక్యరాజ్యసమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధిగా పనిచేస్తున్న శ్రీ పర్వతనేని హరీష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హ్యూస్టన్‌లోని భారత కాన్సులేట్ జనరల్ శ్రీ మంజునాథ్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.
ఈ స్వర్ణోత్సవ వేడుకలకు కన్వీనర్‌గా శ్రీ జితేందర్ రెడ్డి, సంస్థ అధ్యక్షుడిగా శ్రీ యాదగిరి రెడ్డి కుడుముల వ్యవహరించారు. ఈ సందర్భంగా శ్రీ చిట్టెన్ రాజు వంగూరి, శ్రీమతి రత్న కుమార్ పాపలను జీవన సాఫల్య పురస్కారాలతో ఘనంగా సత్కరించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events