బెల్జియంలో అరుదైన ఘటన జరిగింది. ఒక మురికి కాలువలో కార్మికులు శుభ్రం చేస్తుండగా అత్యంత ఖరీదైన బంగారు కడ్డీలు, అరుదైన నాణేలు లభించాయి. వాటి విలువ రూ.98 కోట్లు ఉంటుందని అంచనా. ఈ ఘటన ఇటీవల బెల్జియం, బ్రస్సెల్స్ సమీపంలోని డెండర్‌మోండో ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ఒక బిల్డింగు వద్ద పునరుద్ధరణ, నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా కార్మికులు ఒక మురికి కాలువలో దిగి పని చేస్తుండగా, వారికి మొదట కొన్ని నాణేలు లభించాయి. అవి 1 యూరో నాణేలు. ఇవి చాలా పాతకాలం నాటివి అయినప్పటికీ సాధారణమైనవే అని భావించారు.

అలా కాలువలో తవ్వుకుంటూ వెళ్తుండగా మరిన్ని నాణేలు దొరికాయి. అలాగే, భారీ ఎత్తున బంగారు కడ్డీలు కూడా లభించాయి. 49 పెద్ద బంగారు కడ్డీలు, బకెట్ నిండా బంగారు నాణేలు, ఇతర అరుదైన నాణేలు లభించాయి. ఇలా భారీ నిధి బయటపడటంతో అక్కడి మేనేజర్లు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఆ బంగారు నిధిని స్వాధీనం చేసుకున్నారు. వాటిని అత్యంత భద్రత కలిగిన ప్రభుత్వ గదికి తరలించి, తాళం వేశారు. అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ నిధికి సంబంధించిన ఫొటోల్ని పోలీసులు, స్థానిక అధికారులు మీడియాకు వెల్లడించారు. వాటి అన్నింటి విలువ రూ.98 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ నిధులు దొరికిన బిల్డింగ్ సీఏడబ్ల్యూ ఊస్ట్-వ్లాండెరెన్ అనే చారిటీ సంస్థకు చెందిందని అధికారులు అన్నారు.















