కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక సదుపాయాల కల్పన కోసం భారీగా అప్పులు చేస్తున్న నేపథ్యంలో వేతన వ్యయాలను తగ్గించుకునేందుకు ఒరాకిల్ మరో విడత ఉద్యోగాల కోతకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. అంతర్జాతీయంగా మార్చి నెలలో దాదాపు 20,000 నుంచి 30,000 మంది ఉద్యోగులను తొలగించిన ఈ అమెరికన్ టెక్ దిగ్గజం ఇప్పుడు మరోసారి ఉద్యోగులపై వేటుకు సన్నద్ధమవుతున్నది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 1వ తేదీ కీలకమైనదిగా కనిపిస్తున్నది.

తొలగించగల ఉద్యోగాలను గుర్తించవలసిందిగా మేనేజర్లను కోరినట్టు సమాచారం. దీంతో ఒరాకిల్ మార్చి కోతల సమయంలో వచ్చిన ఉదయపు తొలగింపు ఈమెయిల్సే మళ్లీ ఉద్యోగులకు ఎదురవుతాయేమోనన్న భయాలు పెరుగుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం కొత్త త్రైమాసికం ప్రారంభం కాగానే జీతాల కోతలను అమలు చేయాలని ఒరాకిల్ భావిస్తున్నది. అయినప్పటికీ సెప్టెంబర్ 1న సామూహిక తొలగింపు జరుగుతుందని ఒరాకిల్ ఇప్పటివరకు ధృవీకరించలేదు.

ఒరాకిల్ ఇప్పటికే సుమారు 21,000 ఉద్యోగాలను తగ్గించింది. కంపెనీలో ఉద్యోగుల సంఖ్య సుమారు 1.62 లక్షల నుంచి 1.41 లక్షలకు తగ్గింది. అంటే కంపెనీ తన సిబ్బంది సంఖ్యను సుమారు 21,000మంది మేర తగ్గించుకుంది. కేవలం భారత్లోనే దాదాపు 12,000 మందిపై వేటు పడినట్టు తెలుస్తున్నది.














