కాలిఫోర్నియాలోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న కేరళ కు చెందిన ఇద్దరు మహిళలు మరణించారు. అక్కడి పోలీసులు సంఘటానా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి హత్యగానిర్ధారించారు. ఓ మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ హత్యలు ఆగస్టు 28న కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో జరిగాయి. తిరువనంతపురంలోని కేశవదాసపురానికి చెందిన 40 ఏండ్ల యాన్ మేరీ మాథ్యూ కత్తిపోట్లతో, త్రిసూర్‌లోని ముడిక్కోడ్‌కు చెందిన 35 ఏండ్ల అంజన హరి కారు ఢీకొట్టడంతో మరణించారు.

మిల్పిటాస్ పోలీసుల ప్రకారం మిల్‌క్రీక్ అపార్ట్‌మెంట్స్ సమీపంలోని డిక్సన్ ల్యాండింగ్ రోడ్డు వద్ద జరిగిన హిట్ అండ్ రన్ ఘటనపై ముందుగా సమాచారం అందింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి ఒక బ్లూ ఎస్‌యూవీ కారు అక్కడి నుంచి వెళ్లిపోయిందని చూసినవారు పోలీసులకు తెలిపారు. అలాంటి కారే సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో ఉండగా, ఆ కారు నడిపిన మిల్పిటాస్‌కు చెందిన 32 ఏండ్ల మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె కొట్టాయంలోని మూన్నిలావుకు చెందిన అనిల అని, ఆమె మరణించిన ఇద్దరు మహిళలకు స్నేహితురాలు అని బంధువులు తెలిపారు.














