అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ కీలక సందేశం ఇచ్చారు. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో జరిగిన యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి భగవత్ మాట్లాడుతూ ప్రవాస భారతీయులు వారు నివసిస్తున్న, పనిచేస్తున్న దేశానికే (కర్మభూమి) సంపూర్ణ విధేయతతో ఉండాలని చెప్పారు. అయితే కర్మభూమికి విధేయంగా ఉంటూనే జన్మభూమిని కూడా గుర్తుంచుకోవాలని, మరిచిపోవద్దని మీరు అమెరికాలో ఉన్నారు. ఇక్కడే జీవిస్తున్నారు, ఇక్కడే సంపాదిస్తున్నారు. కాబట్టి మీరు అమెరికాకు నిజాయతీగా మెలగాలి అని స్పష్టంచేశారు. అదే సమయంలో భారత్ వారి జన్మభూమి అని గుర్తుచేశారు. కర్మభూమిపట్ల తమ బాధ్యతలను నెరవేర్చిన తర్వాత, జన్మభూమి అయిన భారత్‌కు సేవ చేసేందుకు వారికి అవకాశం ఉందని, అది నిషిద్ధం కాదని చెప్పారు. ఈ విధంగా ప్రవాసులు తమ విధేయత, బాధ్యతలను సమన్వయం చేసుకోవాలని సూచించారు.

భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతీయుల డీఎన్ఏలోనే ఉందని భగవత్ అన్నారు. అమెరికాను ప్రస్తావించినప్పుడు బహుళత్వం అనే పదం వస్తుందని, అదే భారత్ గురించి మాట్లాడితే భిన్నత్వంలో ఏకత్వం అనే మాట వినిపిస్తుంద ని చెప్పారు. ఈ ఏకత్వం, భిన్నత్వం రెండూ భారత ప్రజల రక్తంలోనే ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. భిన్నత్వం కారణంగానే ఏకత్వం మరింత శోభాయమానంగా ఉంటుందని, కాబట్టి దానిని మనం ఉత్సవంలా జరుపుకో వాలని అన్నారు. స్వామి వివేకానంద చెప్పిన మాటలను ఉటంకిస్తూ, భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే భారత్ విధి అని తెలిపారు.















