అగ్ర కథానాయిక రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మైసా. స్త్రీశక్తిని, మహిళా సాధికారతను చాటిచెప్పే స్ఫూర్తివంతమైన కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో గోండ్ తెగకు చెందిన గిరిజన అమ్మాయి పాత్రలో కనిపించనుంది రష్మిక మందన్న. ఈ చిత్రానికి రవీంద్ర పుల్లె దర్శకుడు. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుడుతూ ఓ మైసా రే అనే తొలి గీతాన్ని విడుదల చేశారు. జేక్స్ బిజోయ్ స్వరపరచిన ఈ పాటను సుద్దాల అశోక్‌తేజ రచించారు. సింధూజ శ్రీనివాసన్ ఆలపించారు.

శత్రువుల కుత్తుకపై కత్తులనే నూరాలి రా.. బాణాలకు నెత్తుటితో తానాలు పోయాలిరా అంటూ సాగిన ఈ పాటలో మైసాను ఈషి, ఐషి రూపాల్లో ఆవిష్కరించారు. స్త్రీ తాలూకు దైవిక శక్తినీ, ధైర్యసాహసాలను ఈ గీతం ప్రతిబింబించింది. అటవీ నేపథ్యంలో వందలాది డ్యాన్సర్లతో తెరకెక్కిన ఈ పాటలోని విజువల్స్ కూడా హైలైట్‌గా నిలిచాయి. ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేష్ తదితరులు నటిస్తున్నారు. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, నిర్మాణం: అన్‌ఫార్ములా ఫిల్మ్స్, రచన-దర్శకత్వం: రవీంద్ర పుల్లె.















